Odisha: ఒడిశా తుపాను బాధితులకు రూ.15 కోట్లు సాయం ప్రకటించిన చంద్రబాబు
- ఒడిశా తీవ్రంగా నష్టపోయింది
- మానవతా ధర్మంతోనే ఆదుకుంటున్నాం
- బాధితులకు అందరూ అండగా నిలవాలంటూ పిలుపు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒడిశాలో ఫణి తుపాను కారణంగా నష్టపోయిన బాధితుల కోసం ఆర్థికసాయం ప్రకటించారు. ఒడిశా తుపాను బాధితులకు రూ.15 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. పొరుగు రాష్ట్రంలో విద్యుత్, రోడ్డు రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, చాలామంది ప్రజలకు ఆహారం, తాగునీరు అందని పరిస్థితి నెలకొందని వివరించారు. ఒడిశాలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఏపీ అన్నివిధాలుగా చేయూతనిస్తుందని అన్నారు. ఒడిశాలో తాము అందిస్తున్న సహాయక చర్యలు మరింత విస్తరిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.
ఫణి తుపాను కారణంగా ఒడిశా రాష్ట్రం కకావికలం అయిందని చంద్రబాబు వివరించారు. మానవతా ధర్మంతోనే ఈ ఆర్థికసాయం ప్రకటించినట్టు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు ఒడిశాను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.