Uttar Pradesh: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం: హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
- లక్నోలోని స్కాలర్స్ హోం పాఠశాలలో ఓటేసిన మంత్రి
- ఇక్కడి నుంచే పోటీ పడుతున్న రాజ్‌నాథ్
- గతంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రాతినిధ్యం
కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ (బీజేపీ)యేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌లో భాగంగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని స్కాలర్స్ హోం పాఠశాలలో మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, మోదీయే ప్రధాని అవుతారని తెలిపారు.
ఇక ఐదో విడతలో పోలింగ్ జరుగుతున్న కీలక నియోజకవర్గాల్లో లక్నో కూడా ఒకటి. గతంలో మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరుసగా జరిగిన ఐదు ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో లాల్జీ టాండన్ గెలుపొందగా ప్రస్తుతం రాజ్‌నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
1991 నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ తన విజయబావుటా ఎగురవేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజ్‌నాథ్‌సింగ్, ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థిగా సినీనటుడు శత్రుఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ పోటీ పడుతున్నారు.