Telangana: అధికారుల నిర్వాకం.. తెలంగాణలో రెండు చోట్ల ఆగిపోయిన పోలింగ్!
- రంగారెడ్డి, యాదాద్రిలో పోలింగ్ కు బ్రేక్
- తారుమారు అయిన బ్యాలెట్ పత్రాలు
- నేడు ప్రారంభమైన తొలి విడత పరిషత్ పోలింగ్
తెలంగాణలో తొలివిడత పరిషత్ ఎన్నికల సందర్భంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని మొయినాబాద్ మండలం హాజీజ్ నగర్ లో ఏర్పాటు చేసిన 111వ నంబర్ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు తారుమారు అయ్యాయి. ఓ గ్రామానికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు మరో గ్రామంలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దీంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ను నిలిపివేశారు.
మరోవైపు ఇదే కారణంతో యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం షేరిగూడెంలో కూడా పోలింగ్ ఆగిపోయింది. జనగామకు చెందిన బ్యాలెట్ పత్రాలు షేరిగూడెంకు వచ్చాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలివిడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 2,097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.