Telangana: కరీంనగర్ లో 'కొత్త' ఫ్రెండ్లీ పోలీసింగ్.. పోలీస్ స్టేషన్ లోనే కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలు!
- కరీంనగర్ లోని మానకొండూరు పీఎస్ లో ఘటన
- దగ్గర ఉండి వేడుకలు జరిపించిన సీఐ ఇంద్రసేనా రెడ్డి
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేపడుతున్నామనీ, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతుంటారు. అయితే కరీంనగర్ జల్లాలో మాత్రం ఓ సీఐ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు సరికొత్త అర్థాన్ని ఇచ్చారు. ఓ కాంట్రాక్టర్ పుట్టినరోజు వేడుకలను తన ఆఫీస్ క్యాబిన్ లో ఘనంగా నిర్వహించారు. సదరు కాంట్రాక్టరు మెడలో పూలమాల వేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
కరీంనగర్ లోని మానకొండూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి పుట్టినరోజు ఇటీవల జరిగింది. దీంతో సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆయన పుట్టినరోజు వేడుకలను స్టేషన్ లోనే ఏర్పాటుచేశారు. కేక్ తెచ్చి కోసి ఆయనకు తినిపించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ లోని సిబ్బందికి కేకు పంచారు. అక్కడితో ఆగకుండా ఫొటోలు, వీడియోలు కూడా దిగారు. కాగా, ఓ ప్రైవేటు వ్యక్తికి పోలీస్ స్టేషన్ లో రాచమర్యాదలు చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.