geetanjali: నన్ను పెళ్లి చేసుకుంటానని హరనాథ్ గారు అనడంతో మా నాన్నగారు టెన్షన్ పడిపోయారు: సీనియర్ నటి గీతాంజలి
- సీతారామ కల్యాణం'లో నేను సీతను
- శ్రీ రాముడిగా హరనాథ్ గారు చేశారు
- ఎన్టీఆర్ గారు అడిగినా చెప్పలేదు
కథానాయికగా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలను చేసి మెప్పించిన గీతాంజలి, తాజా ఇంటర్వూలో మాట్లాడుతూ ఒక సరదా సంఘటనను గురించి ప్రస్తావించారు. నా తొలి సినిమా 'సీతారామ కల్యాణం' .. ఈ సినిమాలో నేను 'సీతాదేవి'గా నటించగా, శ్రీరాముడిగా హరనాథ్ చేశారు. ఆ రోజున నన్ను హరనాథ్ పెళ్లి చేసుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. నాతో పాటు మా నాన్న శ్రీ రామ్మూర్తిగారు సెట్లో వున్నారు. మాకు సినిమా అనేది కొత్త కావడం వలన 'ఏవండోయ్ శ్రీరామ్మూర్తిగారు .. ఈ రోజున మీ అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసేస్తాను .. చూసుకోండి మరి .. ఈ రోజు నుంచి నా భార్య అయిపోతుంది' అని హరనాథ్ గారు మా నాన్నగారిని ఆటపట్టిస్తున్నారు.
'అమ్మాయికి ఇదే మొదటి ఛాన్స్ .. అలా చేయకు నాయనా ..' అంటూ మా నాన్న కంగారు పడిపోతున్నారు. హరనాథ్ గారు ఏం చేస్తున్నది దగ్గరే వుండి మా నాన్నగారు గమనిస్తున్నారు. అది చూసిన ఎన్టీఆర్ గారు 'ఎందుకని శ్రీరామ్మూర్తిగారు టెన్షన్ పడుతున్నారు?' అని అడిగారు. హరనాథ్ గారు ఇలా అంటున్నారని చెబితే ఎన్టీఆర్ గారు ఆయనని తిడతారేమోనని మేము చెప్పలేదు. అలా హరనాథ్ గారు ఆ సినిమా షూటింగులో మా నాన్నగారిని ఆటపట్టించారు" అని చెప్పుకొచ్చారు .