ram madhav: మాకు ఒంటరిగా మెజార్టీ వస్తే హ్యాపీ.. లేకపోయినా ఎన్డీయే తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం!: బీజేపీ నేత రాంమాధవ్
- క్లీన్ మెజార్టీకి కొంత వెనుకబడే అవకాశం ఉంది
- ఎన్డీయే భాగస్వాములతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
- మెజారిటీ సీట్లను గెలుచుకుంటే అంతకంటే ఆనందం ఉండదు
లోక్ సభ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేతలు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాత్రం మెజార్టీ విషయంలో కొంత అనుమానాన్ని వ్యక్తం చేశారు. క్లీన్ మెజార్టీకి బీజేపీ కొంత వెనుకబడే అవకాశం ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 543 సీట్లుండే లోక్ సభలో మెజారిటీ స్థానాలు సొంతంగా గెలుచుకుంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని... అయితే, ఎన్డీయే పరంగా చూసుకుంటే మాత్రం మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటించిన నేపథ్యంలో, ఉగ్రవాదంపై తాము ఉక్కుపాదం మోపుతామని నిరూపించుకోవడానికి పాకిస్థాన్ కు మంచి అవకాశం దొరికిందని... ఈ అవకాశాన్ని ఆ దేశం ఎలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలని రాంమాధవ్ అన్నారు. చైనాతో సత్సంబంధాలను నెలకొల్పడంలో ప్రధాని మోదీ సఫలమయ్యారని చెప్పారు.