mayavati: 'అంతా సవ్యంగా జరిగితే..' అంటూ ప్రధాని పదవిపై మాయావతి కీలక వ్యాఖ్యలు
- ఎన్నికల తర్వాత అంబేద్కర్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తా
- జాతీయ రాజకీయాలకు మార్గం అక్కడి నుంచే వెళుతుంది
- నమో యుగం అంతమవబోతోంది
ప్రధాని పదవిని చేపట్టాలన్న తన ఆకాంక్షను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టంగా వెలిబుచ్చారు. అంతా సవ్యంగా జరిగితే... ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా మూడోకూటమి అధికారంలోకి వస్తే ప్రధాని రేసులో తాను కూడా ఉంటాననే స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు.
'అంతా అనుకున్నట్టుగా, సవ్యంగా జరిగితే... అంబేద్కర్ నగర్ నుంచి నేను పోటీ చేస్తా. ఎందుకంటే జాతీయ రాజకీయాల వైపుగా వెళ్లే మార్గం అంబేద్కర్ నగర్ గుండా వెళ్తుంది' అని మాయావతి ఓ పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తూ చెప్పారు. 'నమో (నరేంద్ర మోదీ)' యుగం అంతమవబోతోందని... 'జై భీమ్' అని నినదించేవారి సమయం రాబోతోందని అన్నారు.
మాయావతి ప్రధాని కావాలనే ఆకాంక్షను సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా పరోక్షంగా వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన మాట్లాడుతూ, తదుపరి ప్రధానమంత్రిని మహాకూటమి ఇవ్వబోతోందని... జనాభాలో సగభాగమైన మహిళ ఆ పదవిని చేపడితే బాగుంటుందని ఆయన అన్నారు. తన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రధాని అయితే తనకు మరింత సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఆ మహిళా ప్రధాని ఎవరేది ఆయన చెప్పకపోయినా... మాయావతిని ఉద్దేశించే ఆయన ఆ మాటలు అన్నారనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది.