Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్ లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఓ మంత్రిపై ఘాటు విమర్శలు!
- నియోజకవర్గం పనులపై అధికారులతో చర్చ
- విశాఖ రేవ్ పార్టీపై సీఎస్, హోంశాఖకు ఫిర్యాదు
- అమరావతిలో మీడియాతో మాట్లాడిన నేత
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈరోజు ఏపీ సచివాలయానికి వచ్చారు. తన నియోజకవర్గానికి సంబంధించిన పనులపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. పెండింగ్ పనుల విషయంలో త్వరితగతిన బిల్లులు విడుదల చేయాలని సూచించారు. అనంతరం బయటకు వచ్చిన విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో ఇటీవల జరిగిన రేవ్ పార్టీ వెనుక ఓ మంత్రి హస్తం ఉందని విష్ణుకుమార్ రాజు తెలిపారు.
ఈ విషయమై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశానని చెప్పారు. విశాఖను డ్రగ్ సిటీగా మార్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోడ్ ఉన్నప్పుడు బీచ్ లో మద్యం తాగడానికి అనుమతి ఇవ్వకూడదనీ, కానీ కొందరు నేతలు అధికారులపై ఒత్తిడి చేసి లైసెన్సులు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖకు చెందిన ఓ మంత్రి పీఏ నుంచి ఎక్సైజ్ ఎస్పీ సుబ్బారావుకు 8 సార్లు ఫోన్లు వెళ్లాయని అన్నారు. ఈ విషయంలో పోరాటానికి వైసీపీ, జనసేన నేతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.