chittibabu: మా అన్నయ్య కోటీశ్వరుడు .. నేను మాత్రం నెలకి 200 ఇస్తూ అద్దె ఇంట్లో వున్నాను: నటుడు చిట్టిబాబు
- నటుడిగానే ఉండాలనుకున్నాను
- అన్నయ్య సిఫార్సులు వద్దనుకున్నాను
- అద్దె ఇంట్లో 29 యేళ్లు వున్నాను
రాజబాబు తమ్ముడిగా తెలుగు చిత్రపరిశ్రమలోకి ప్రవేశించిన చిట్టిబాబు, ఆ తరువాత నటుడిగా తనదైన టాలెంట్ చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు.
"మా అన్నయ్య రాజబాబు నాతో బిజినెస్ పెట్టించాలనుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బును సర్దుబాటు చేస్తానని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు .. కమెడియన్ గా చిన్న వేషాలు వేస్తూ రాణించాలనే ఉద్దేశంతోనే వున్నాను. అప్పట్లో ఒక సినిమా కోసం 10 రోజులు పనిచేస్తే వెయ్యి నూటపదహార్లు ఇచ్చేవారు. చెన్నైలో అన్నయ్యకి సొంత బంగ్లా .. మూడు ఫియట్ కార్లు .. రెండు ఫారిన్ కార్లు వున్నా అక్కడ నేను 3 నెలలు మాత్రమే వున్నాను. మా అన్నయ్యపై ఆధారపడకూడదు .. ఆయన సిఫార్సులతో పైకి రాకూడదు అనే ఆలోచనతో నెలకి 200 రూపాయలకి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, ఆ ఇంట్లో 29 సంవత్సరాలు వున్నాను. ఆ తరువాత హైదరాబాద్ వచ్చేశాను" అని చెప్పుకొచ్చారు.