chittibabu: మా అన్నయ్య కిందపడేసిన రూపాయలు మేము దాచుకుని వుంటే కోటీశ్వరులమయ్యేవాళ్లం: నటుడు చిట్టిబాబు
- అన్నయ్యకి ఆకలి బాధ తెలుసు
- ఎవరు కష్టాల్లో వున్నా సాయం చేసేవారు
- ఎంతోమందిని చదివించారు
తెలుగులో అనేక చిత్రాలలో నటించిన చిట్టిబాబు, తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను నవ్వించారు. అలాంటి చిట్టిబాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన అన్నయ్య అయిన రాజబాబును గురించి ప్రస్తావించారు. "మా అన్నయ్యకి కష్టం విలువ తెలుసు .. ఆకలి బాధ తెలుసు. అందువలన ఎవరు ఎలాంటి సాయం అడిగినా జేబులో చేయిపెట్టి చేతికి ఎంత వస్తే అంత డబ్బు ఇచ్చేసేవాడు.
తన ఖర్చుతో 50 నుంచి 60 వరకూ పేదవారి పెళ్లిళ్లు జరిపించాడు. పేద పిల్లల చదువుకు సాయం చేయడానికి ఎంతమాత్రం ఆలోచించేవాడు కాదు. ఎంతోమందిని తన డబ్బుతో చదివించాడు. ఆనాటి గొప్ప ఆర్టిస్టుల మాదిరిగానే అన్నయ్య కూడా డబ్బుకు ప్రాధాన్యత తక్కువగా ఇచ్చేవాడు. కీర్తి శాశ్వతమని భావించేవాడు. అందువలన మేము కూడా మంచి పేరు తెచ్చుకోవడానికి కృషి చేశాముగానీ, డబ్బు కోసం ఆశపడింది ఎప్పుడూ లేదు. డబ్బుపై ఆశ ఉంటే .. మా అన్నయ్య కింద పడేసుకున్న రూపాయలను ఏరుకుని దాచుకున్నా మేము కోటీశ్వరులమయ్యే వాళ్లం" అని చెప్పుకొచ్చారు.