Karnataka: రైలు ఆలస్యం కారణంగా నీట్ రాయలేకపోయిన కర్ణాటక విద్యార్థులకు శుభవార్త
- నీట్ రాయలేకపోయిన 250 మంది విద్యార్థులు
- మోదీకి తెలియజేసిన సిద్ధ రామయ్య
- స్పందించిన ప్రకాశ్ జవదేకర్
రైలు ఆలస్యం కారణంగా నీట్ పరీక్ష రాయలేకపోయిన కర్ణాటక విద్యార్థుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆ విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని నేడు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఆ విద్యార్థులకు మే 20న పరీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా దాదాపు 250 మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాలేకపోయారు.
ఈ విషయాన్ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ జవదేకర్, ‘రైలు ఆలస్యంగా రావడం వల్ల నీట్ రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ఇస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.