Maharashtra: కులాంతర వివాహం చేసుకున్నారని.. భార్యాభర్తలపై పెట్రోలు పోసి నిప్పంటించిన యువతి కుటుంబ సభ్యులు!
- మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఘటన
- యువకుడిని ఇంటికి పిలిపించిన యువతి కుటుంబ సభ్యులు
- మాట్లాడుకుంటుండగా ఇద్దరిపైనా పెట్రోలు పోసి నిప్పుపెట్టిన వైనం
మహారాష్ట్రలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న ఓ జంటను అమ్మాయి తరపు బంధువులు సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోగా, యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అహ్మద్‌నగర్ జిల్లాలోని నిఘోజ్ గ్రామానికి చెందిన రుక్మిణీ సింగ్ (19), మంగేశ్ రణ్‌సింగ్ (23)లు గతేడాది అక్టోబరులో ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లికి రుక్మిణి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మంగేశ్ కుటుంబ సభ్యులే దగ్గరుండి వీరి పెళ్లి జరిపించారు. అయితే, కుమార్తెపై ప్రేమతో రుక్మిణి తల్లి మాత్రం ఈ పెళ్లికి హాజరైంది. గత నెల 30న భర్తతో చిన్నపాటి గొడవ జరగడంతో రుక్మిణి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మంగేశ్‌పై కోపంతో రగిలిపోతున్న రుక్మిణి కుటుంబ సభ్యులకు కక్ష తీర్చుకునేందుకు ఇదో సదవకాశంగా కనిపించింది. రుక్మిణితో ఫోన్ చేయించి మంగేశ్‌ను ఇంటికి పిలిపించారు. ఇద్దరూ కలిసి ఇంట్లో మాట్లాడుకుంటుండగా గది తలుపులు మూసి పెట్రోలు పోసి నిప్పంటించారు.
మంటల్లో చిక్కుకున్న రుక్మిణి, మంగేశ్ అరుపులతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. 70శాతం కాలిన గాయాలతో బాధపడిన రుక్మిణి పుణెలోని సస్సూన్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. 50 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న మంగేశ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువతి తండ్రి కోసం గాలిస్తున్నారు.