Undavalli: ‘పోలవరం’లో తేడా వస్తే రాజమండ్రి మిగలదు, మొత్తం కొట్టుకుపోతుంది!: ఉండవల్లి హెచ్చరిక
- డ్యామ్ దగ్గర స్థలం కుంగడం మామూలు విషయం కాదు
- ఒక్క జియాలజిస్ట్ కూడా లేకుండానే నిర్మిస్తున్నారు
- స్పిల్ వేపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న స్థలంలో భూమి కుంగిపోవడం సాధారణమైన విషయం కాదని సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. దీని ప్రభావం ప్రస్తుతం కడుతున్న ‘స్పిల్ వే’పై ఉంటుందని హెచ్చరించారు. ఓ జియాలజిస్టును కూడా పెట్టుకోకుండా ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు.
జియాలజిస్టులను పిలిచి ఇప్పటికైనా పరిస్థితిని సమీక్షించాలని కోరారు. ‘ఇప్పటికైనా మేల్కొంటే కేవలం డబ్బు మాత్రమే పోతుంది. కానీ డ్యామ్ పూర్తయ్యాక వరద వస్తే రాజమండ్రి అనేదే ఉండదు.. మొత్తం కొట్టుకుపోతుంది’ అని హెచ్చరించారు.
విజయవాడలో ఈరోజు ఏర్పాటుచేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఉండవల్లి మాట్లాడారు. రాజమండ్రికి, పోలవరం డ్యామ్ కు మధ్య ఉన్న ఊర్లన్నీ వరద వస్తే కొట్టుకుపోతాయని స్పష్టం చేశారు. నిన్న అమరావతిలో కట్టిన బిల్డింగులకే లీకేజీలు వచ్చాయనీ, వాటిని సిమెంట్ వేసి సరిదిద్దుకోవచ్చని వ్యాఖ్యానించారు.
కానీ పోలవరం ప్రాజెక్టు బద్దలైతే, తీవ్ర వినాశనం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు వీలవుతుందని తాను చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తుచేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.300 కోట్ల వ్యయం చాలని, అలాంటిది రూ.1600 కోట్లను తగలేశారని మండిపడ్డారు. పోలవరం తేడా వస్తే ప్రజలు మిగలరనీ, ఊర్లు మిగలవనీ హెచ్చరించారు.