karti chidambaram: కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట
- అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లనున్న కార్తీ
- మే, జూన్ మాసాల్లో వెళ్లేందుకు సుప్రీం అనుమతి
- రూ. 10 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలంటూ ఆదేశం
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మే, జూన్ మాసాల్లో అమెరికా, జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. కార్తీ పలు క్రిమినల్ కేసులకు సంబంధించి ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కార్తీకి షరతులతో కూడిన అనుమతిని సుప్రీం జారీ చేసింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ వద్ద రూ. 10 కోట్ల నగదును డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విదేశాలకు వెళ్లిన తర్వాత అదృశ్యం కాబోనని, విచారణ సంస్థలకు సహకరిస్తానని కోర్టులో వాంగ్మూలాన్ని ఫైల్ చేయాలని తెలిపింది. మరోవైపు, చిదంబరం, కార్తీలను ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసుల్లో మే 30 వరకు అరెస్ట్ చేయరాదని ఢిల్లీలోని ఓ కోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.