Andhra Pradesh: ‘కాబోయే సీఎస్ నువ్వే..రెండేళ్లు పదవిలో ఉంటావు’ అని చంద్రబాబు ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చెప్పలేదా?: ఉండవల్లి
- ఏపీ సీఎస్ తో గొడవేంటో నాకు అర్థం కావట్లేదు
- ఈసీ ఆదేశాలతోనే ఏపీ సీఎస్ పనిచేస్తున్నారు
- విజయవాడలో మీట్ ది ప్రెస్ లో ఉండవల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఉన్న గొడవేంటో తనకు అర్థం కావడం లేదని సీనియర్ రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని, ప్రతిపక్ష నేత జగన్ ను విమర్శిస్తే అది రాజకీయం అవుతుందనీ, కానీ ఏపీ సీఎస్ ను విమర్శిస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఈసీ చెప్పినట్లే ఎల్వీ సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ పునేఠాను ఈసీ తప్పించడంపై ఈరోజు విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని ఈసీ ఓ ఆర్డర్ వేస్తే, ఆ ఆర్డర్ తప్పని సీఎస్ ఉత్తర్వులు జారీచేస్తే ఈసీ ఊరుకుంటుందా? ఎదురు ఆర్డర్ ఇవ్వడమే కాకుండా కోర్టుకు కూడా వెళ్లారు. అప్పుడు కోర్టు అది తప్పు అని చెప్పడంతో సీఎస్ గా పునేఠాను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం రాగానే అసలు మీకు ఎందుకు తగవు? ఆయన రాగానే ముద్దాయి అని ఎలా చెప్పారు? మరి ముద్దాయిగా ఉన్నప్పుడు ఆరోగ్యశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఎలా ఇచ్చారు?
చంద్రబాబే స్వయంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన పేరును సిఫార్సు చేశారు. ’తరువాత కాబోయే చీఫ్ సెక్రటరీవి నువ్వే. రెండేళ్ల పాటు ఉంటావు’ అని చంద్రబాబు ఎల్వీ సుబ్రహ్మణ్యంతో అన్నట్లు పేపర్ లో చదవాను. చంద్రబాబు వంటి సమర్థుడైన మ్యానిపులేటర్ ఎందుకు ఇలాంటి తప్పులు చేసే పరిస్థితి వచ్చింది? ఈవీఎంలు పనిచేయడం లేదు. ఈవీఎంలు మోసం, కానీ నేను మాత్రం 130 స్థానాలు నెగ్గుతాను అంటున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను తీసేసే అధికారం లేదు కాబట్టే మీరు(చంద్రబాబు) మీడియా దగ్గరకు వచ్చారు.
చంద్రబాబులాగా రూల్స్ తెలిసినవాళ్లు ఇంకెవరైనా ఉన్నారా? ఆ కరుణానిధి చనిపోయాక నవీన్ పట్నాయక్ మిగిలాడు. చంద్రబాబు తర్వాత అంతటి అనుభవం ఉన్న నాయకుడు ఎవ్వరూ లేరు. అలాంటి వ్యక్తి ఎల్వీ సుబ్రహ్మణ్యం రాగానే 'అతను ఓ ముద్దాయి.. జగన్ మనిషిని తీసుకొచ్చి పెట్టారు' అన్నారు. ఎన్నికలు అయిపోయాయి. మే 23న ఫలితాలు వచ్చేవరకూ రెస్ట్ తీసుకోండి. ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోండి. రేపు సీఎం అయితే ఎలాగూ మీరు బిజీ అవుతారు’’ అని వ్యాఖ్యానించారు.