stalin: స్టాలిన్ తో కేసీఆర్ భేటీ ఉండకపోవచ్చు!
- నిన్న పినరయి విజయన్ తో కేసీఆర్ భేటీ
- స్టాలిన్, కుమారస్వామిలకు కేసీఆర్ ఫోన్
- ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న స్టాలిన్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముమ్మరం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో నిన్న ఆయన భేటీ అయ్యారు. కూటమి ఏర్పాటుపై చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ తో కలసి పని చేస్తున్న డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలకు కూడా ఆయన ఫోన్ చేశారు.
అయితే, కేసీఆర్ తో స్టాలిన్ సమావేశం జరగకపోవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉన్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. 13వ తేదీన స్టాలిన్ తో భేటీ ఉంటుందని తెలంగాణ సీఎం కార్యాలయం ప్రకటించింది. అయితే, సమావేశపు తేదీ ఇంకా నిర్ణయం కాలేదని ఆ తర్వాత టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో మే 23 వరకు ఇరువురు నేతల భేటీ ఉండకపోవచ్చని అంటున్నారు.