vinayak: దర్శకుడిగా ఈవీవీకి గల క్రేజ్ ను చూసి నేను దర్శకుడిని కావాలనుకున్నాను: వీవీ వినాయక్
- మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం
- సినిమాల గురించే ఎక్కువ మాట్లాడేవాడిని
- రచయితలతో ఎక్కువగా కూర్చునేవాడిని
మాస్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో వీవీ వినాయక్ సిద్ధహస్తుడు. అందువలన ఆయన సినిమాలు బి - సి సెంటర్స్ లో ఎక్కువ రోజులు ఆడుతుంటాయి. అలాంటి వినాయక్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు సినిమాలంటే ఇష్టం. ఏ సినిమా చూసినా ఈ సినిమాను ఇలా తీస్తే బాగుండేది కదా అని స్నేహితులతో చర్చించేవాడిని.
ఇక దర్శకుడిని కావలసిందే అనే ఆలోచన ఈవీవీ సత్యనారాయణగారిని చూసిన తరువాత వచ్చింది. ఆయన దర్శకుడైన కొత్తలో ఎక్కడ ఏ ఇద్దరిని చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటూ వుండేవారు. ఇలాగే మన గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలనే పట్టుదలతో దర్శకత్వంపై దృష్టిపెట్టాను. నా సినిమా లేనప్పుడు .. ఇతర సినిమాలకి సంబంధించిన విషయాలపై కూడా శ్రద్ధ పెట్టేవాడిని. రచయితలతో కూర్చుని స్క్రిప్ట్ కి సంబంధించిన విషయాలను నేర్చుకునేవాడిని" అని చెప్పుకొచ్చారు.