Jaggareddy: జగ్గారెడ్డి వ్యాఖ్యలతో ప్రజల్లో అనుమానం: విజయశాంతి
- టీఆర్ఎస్ యూపీఏలో చేరుతుందన్న జగ్గారెడ్డి
- అభ్యంతరం వ్యక్తం చేసిన విజయశాంతి
- ప్రజల్లో అనుమానాలు తలెత్తుతాయని హితవు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సేనని, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని జోస్యం చెప్పారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్‌లు కూడా యూపీఏలో చేరడం ఖాయమన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యాలపై విజయశాంతి అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ చావో, రేవో అనేలా పోరాడుతోందని, ఇటువంటి సమయంలో అటువంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. యూపీఏలో టీఆర్ఎస్ చేరబోతోందని చెబితే.. కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్‌కు ఓటేయడం బెటరని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కూడా ఏదో ఉందని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు. టీఆర్ఎస్, వైసీపీ మద్దతు లేకుండా కేంద్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి విశ్వసిస్తున్నట్టు అనిపిస్తోందని విజయశాంతి పేర్కొన్నారు.