mamata banerjee: మోదీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూపించాలి!: మమత బెనర్జీ
- పశ్చిమ బెంగాల్ మూడు ‘టి’లకు ప్రసిద్ధి చెందిందన్న మోదీ
- ఘాటు కౌంటర్ ఇచ్చిన మమత
- మోదీ పెద్ద అబద్ధాల కోరు
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విరుచుకుపడ్డారు. మోదీ తనపై చేసి ట్రిపుల్-టి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూడాల్సి (ఎన్నికల్లో ఓటమి) వుందని అన్నారు. ఇటీవల మోదీ మాట్లాడుతూ.. మమత హయాంలో పశ్చిమ బెంగాల్ మూడు-టి లకు ప్రసిద్ధి చెందిందని, అందులో ఒకటి తృణమూల్ కాగా, రెండోది టోలాబాజీ (బలవంతపు వసూళ్లు) అని, మూడోది ట్యాక్సెస్ (పన్నులు) అని ఆరోపించారు.
మోదీ వ్యాఖ్యలపై మమత విరుచుకుపడ్డారు. మొన్న రాజీవ్‌ను నంబర్ వన్ అవినీతి పరుడని అన్నారని, తననేమో వసూళ్లకు పాల్పడేదానినని అంటున్నారని పేర్కొన్నారు. మరి ఆయననేమనాలని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గౌరవించాల్సింది పోయి రాజీవ్‌ను అవినీతిపరుడని అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ శరీరం మొత్తం ప్రజల రక్తంతో తడిసిపోయిందని దుయ్యబట్టారు. పురులియా లోక్‌సభ స్థానం పరిధిలోని రఘునాథ్పుర్, బంకురా పరిధి బర్జోరాలో మంగళవారం మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను చాలామంది ప్రధానులను చూశానని, కానీ మోదీ అంత అబద్ధాలకోరును ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన మళ్లీ ఎన్నికైతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుందన్నారు. చరిత్రను, భౌగోళికతను, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని ఆరోపించారు. మోదీకి ప్రజాస్వామ్యం చెంపదెబ్బ రుచి చూపించాల్సిన అవసరముందని మమత పేర్కొన్నారు.