Alwar gangrape: రాజకీయ రంగు పులుముకున్న అళ్వార్ అత్యాచారం కేసు.. బీజేపీ-కాంగ్రెస్ డిష్యుం డిష్యుం
- ఓట్లు పోతాయని ప్రభుత్వం కేసును తొక్కి పెడుతోంది
- ఇప్పటివరకు నిందితులను పట్టుకోకపోవడం దారుణమన్న బీజేపీ
- ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ ఆరోపణలన్న సీఎం
అళ్వార్ అత్యాచారం కేసు రాజకీయ రంగు పులుముకుంది. గత నెల 26న ఓ దళిత యువతిపై కొందరు దుండగులు భర్త కళ్ల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నికల నేపథ్యంలో తమకెక్కడ హాని జరుగుతుందోనని భయపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును తొక్కిపెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.
కేసును బయటకు రాకుండా ప్రభుత్వం తొక్కి పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ ఆరోపించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, ఇప్పటి వరకు నిందితులను పట్టుకోకపోవడం దారుణమని అన్నారు. గత నెల 26న ఘటన జరిగిందని, మే 3న ఎఫ్ఐఆర్ నమోదైందని అన్నారు. అయితే, నిన్నటి వరకు విషయం బయటకు రాకపోవడం వెనక ప్రభుత్వ కుట్ర ఉందని మదన్ లాల్ ఆరోపించారు. ఎన్నికలు జరుగుతుండడంతోనే ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. ఒకవేళ ఈ విషయం బయటపడితే ఎన్నికల్లో తమకు చేటు జరిగే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం కేసును తొక్కిపెడుతోందని ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ స్పందించారు. ఆ పార్టీవి అర్థంపర్థం లేని ఆరోపణలని కొట్టిపడేశారు. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ ఆరోపణలు చేస్తోందని సీఎం దుయ్యబట్టారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఇందేరాజ్ గుర్జార్ అనే ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం 14 బృందాలను దింపినట్టు పేర్కొన్నారు.