Andhra Pradesh: ఉండవల్లీ... ప్రేమ ఉంటే వైసీపీలో చేరు.. ప్రజలను పక్కదారి పట్టించొద్దు!: దేవినేని ఉమ
- పోలవరంపై కేసీఆర్ కేసులు వేయించారు
- జగన్ ఆయనిచ్చే కాసుల కోసం మౌనంగా ఉన్నారు
- అమరావతిలో మీడియాతో ఏపీ మంత్రి
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం మునిగిపోతుందని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు వేయిస్తున్నారని ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ముందుకు సాగకుండా ఏదో రకంగా అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం జగన్ ఆశపడుతున్నారనీ, అందుకే నోరు విప్పడం లేదని దుయ్యబట్టారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో లబ్ధి పొందినవారంతా తెలంగాణలో టీఆర్ఎస్ లోకి, ఏపీలో వైసీపీలోకి వెళ్లారని ఉమ విమర్శించారు. ‘పోలవరం పనులన్నీ వేగవంతం చేయడానికి ముఖ్యమంత్రి క్షేత్ర స్ధాయి పర్యటన నిర్వహిస్తున్నారు. 70 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. అప్పర్ కాఫర్, లోయర్ కాఫర్ డ్యాం నిర్మాణాలు వేగవంతం చేయాలి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో పనులు వేగంగా జరుగుతున్నాయి.
సుమారు 500 మంది ఇంజినీర్లు డ్యాం సైట్లో పనిచేస్తున్నారు’ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో తేడా వస్తే రాజమండ్రి కొట్టుకుపోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడంపై స్పందిస్తూ..‘వైసీపీపై ప్రేమ ఉంటే ఆ పార్టీలో చేరండి. కానీ ఇలా ప్రజలను పక్కదారి పట్టించొద్దు. ఒక్కసారి కూడా డ్యామ్ చూడకుండానే సాక్షిలో అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.’ అని మండిపడ్డారు.