Andhra Pradesh: జగన్ కు పట్టిన శని విజయసాయిరెడ్డే.. 23 తర్వాత వైసీపీ దుకాణం మూతపడుతుంది!: ఉమ జోస్యం
- కేసీఆర్, కవిత పిటిషన్లపై కేవీపీ మౌనం ఎందుకు?
- మట్టి పనులు చేసి కోట్లు దండుకున్నారు
- జగన్ కు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారు
- అమరావతిలో మీడియాతో ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుపై తీవ్రంగా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవిత కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పుడు కేవీపీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర కేవలం మట్టిపనులు చేసి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. అప్పట్లో జగన్ కు లబ్ధి చేకూర్చడానికి కేవీపీ శతవిధాలా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.
‘పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతుండగానే, ఇక్కడ పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు చేపట్టాలని కేవీపీ ప్రయత్నించారు. ఈ దుర్బుద్ధి కారణంగా పోలవరం పనులు రెండేళ్లకుపైగా ఆగిపోయాయి. జగన్ కనుసన్నల్లో ఇక్కడ రాజమండ్రిలో ఉండవల్లి, ఢిల్లీలో కేవీపీ నాటకాలు ఆడుతున్నారు. కోట్ల మంది ప్రజలు, రైతుల గుండె చప్పుడు పోలవరం. అనవసరంగా ప్రాజెక్టు జోలికి రావొద్దు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నా, పోలవరం పనులు జరుగుతున్న వేగంగా ఎక్కడా ఏ ప్రాజెక్టూ సాగడంలేదు’ అని వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత జగన్ కు పట్టిన శని విజయసాయిరెడ్డి అని ఉమ ఎద్దేవా చేశారు. మే 23 తర్వాత వైసీపీ దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు. పోలవరాన్ని మోదీ, విజయసాయిరెడ్డి, జగన్ ఒక్కసారి కూడా చూడలేదన్నారు. కేసీఆర్, జగన్ దర్శకత్వంలో అందరూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా పోలవరంపై విషం చిమ్మే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.