Andhra Pradesh: ఢిల్లీలో సీఎం చంద్రబాబు, రాహుల్ గాంధీ కీలక భేటీ!
- సుప్రీం తీర్పు, ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
- మెజారిటీ రాని పక్షంలో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు
- కోల్ కతా బయలుదేరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీల మధ్య ఈ రోజు కీలక సమావేశం జరిగింది. వీవీప్యాట్ల విషయంలో విపక్ష నేతలతో చర్చించేందుకు నిన్న ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, పలువురు నేతలతో సమావేశమయ్యారు. తాజాగా ఈరోజు ఉదయం రాహుల్ తో 30 నిమిషాల పాటు సమాలోచనలు జరిపారు.
ఈ భేటీలో వీవీప్యాట్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏరకంగా ముందుకు పోవాలన్న విషయమై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ యూపీఏకు మెజారిటీ రాకుంటే తటస్థులను కలుపుకునిపోయే విషయమై కూడా రాహుల్, చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు పేర్కొన్నాయి.
కాగా, ఈ సమావేశం అనంతరం చంద్రబాబు కోల్ కతా బయలుదేరి వెళ్లారు. అక్కడ ఈరోజు ఖరగ్ పూర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.