Andhra Pradesh: అమరావతిలో నిర్మాణాల కంటే తాటాకు పందిళ్లు నయం!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- గాలివానకు అన్నీ కొట్టుకుపోయాయి
- ఐదు కోట్ల మంది ఆంధ్రులను బాబు మోసం చేశారు
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంపై నిన్న ఈదురుగాలులు గట్టి ప్రభావం చూపించాయి. బలమైన గాలులు వీయడంతో సచివాలయంలో ఏర్పాటుచేసిన స్మార్ట్ పోల్ కూలిపోగా, పలు నిర్మాణాలకు వేసిన రూఫ్ టాప్ లు లేచిపోయాయి. ఈ వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. అమరావతి నిర్మాణాల కంటే తాటాకు పందిళ్లు నయం అనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.
చదరపు అడుగుకు రూ.11,000 ఇచ్చి నిర్మాణాలు చేపట్టారనీ, ఇవన్నీ ఒక్క గాలివానకు కొట్టుకుపోవడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఐదు కోట్ల మంది ఆంధ్రుల చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘తాత్కాలిక నిర్మాణాలంటే మరీ ఇంత అన్యాయమా? ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిళ్లు నయం.
చదరపు అడుగుకు రూ.11 వేలిచ్చి, అంతర్జాతీయ డిజైన్లు, కంట్రాక్టర్లు అని చెప్పింది ఒక్క గాలివానకు కొట్టుకుపోయేవి నిర్మించేందుకా? ఐదు కోట్ల మంది ప్రజల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ?’ అని విమర్శించారు.