Andhra Pradesh: రేపటికల్లా ఆ నివేదికలు పంపండి.. అధికారులకు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశం!
- ఈ నెల 14న ఏపీ మంత్రివర్గ సమావేశం
- చర్చించే అంశాలను స్క్రీనింగ్ కమిటీకి పంపాలన్న సీఎస్
- సుబ్రహ్మణ్యం ఓకే చేశాకే కేబినెట్ భేటీ
ఈ నెల 14న ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్ అందింది. దీంతో మంత్రివర్గ సమావేశానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్నిశాఖల అధికారులను సీఎస్ అదేశించారు.
రేపు జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీకి అధికారులంతా హాజరు కావాలని చెప్పారు. ఏపీలో కరవు, ఫణి తుపాను, ఉపాధి హామీ పథకం అమలు, మంచి నీటి సమస్యపై నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన నోట్ ను అన్నిశాఖలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పంపించారు.
కాగా, అధికారుల నివేదికలను పరిశీలించడానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈసీ నిబంధనల మేరకు నివేదికలు ఉన్నట్లు సీఎస్ సంతృప్తి చెందితే కేబినెట్ సమావేశానికి ఈసీ పచ్చజెండా ఊపుతుంది. తొలుత ఈ నెల 10న కేబినెట్ భేటీ నిర్వహించాలని చంద్రబాబు భావించారు. అయితే కేబినెట్ భేటీలోని అంశాలకు ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున సమయం పడుతుందన్న భావనతో మంత్రివర్గ సమావేశాన్ని 14కు వాయిదా వేశారు.