Andhra Pradesh: నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబుకు రూల్స్ తెలియవా?: అంబటి రాంబాబు
- ఎన్నికల కోడ్ అమలులో ఉంది
- కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి తప్పనిసరి
- చంద్రబాబు పంతానికి పోతున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకు రూల్స్ తెలియవా అని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోడ్ అమలులో ఉన్నప్పుడు ఏవిధంగా మంత్రి వర్గ సమావేశం నిర్వహించుకోవాలో నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు రూల్స్ తెలియవా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ అనుమతితో కేబినెట్ భేటీ నిర్వహించుకోవాలని ఈసీ చెబుతున్నప్పటికీ చంద్రబాబు పంతానికి పోతున్నారని విమర్శించారు. రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు వ్యవహరించడం లేదని విమర్శించారు.
ఈ ఎన్నికల్లో టీడీపీ పోవడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయని, ఈ విషయం అందరికన్నా ఎక్కువగా చంద్రబాబుకే తెలుసని అన్నారు. అమరావతిలో నిన్న ఈదురుగాలులతో కూడిన వర్షానికి అక్కడ జరిగిన నష్టం గురించి అంబటి ప్రస్తావించారు. చిన్న పాటి గాలి వస్తే లక్షల పెట్టుబడితో నిర్మించిన భవనాల పైకప్పులు ఎగిరిపోతున్నాయని అన్నారు. అమరావతిలో అడుగడుగునా అవినీతేనని, కమీషన్లు, లంచాలతో నిర్మించిన అమరావతి గాలికి కొట్టుకుపోతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.