Telangana: కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉత్తమ్ అప్పుల్లో కూరుకుపోయారు!: జగ్గారెడ్డి
- పార్టీకోసం పనిచేసేవారు చాలామంది ఉన్నారు
- దీనిపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తా
- హైదరాబాద్ లో మీడియాతో కాంగ్రెస్ నేత
పదవులు, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో పుష్కలంగా ఉన్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే నేతల గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని జగ్గారెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో నేతలపై వస్తున్న విమర్శలపై స్పందించారు.
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ పార్టీ ఎదుగుదల, పటిష్టత కోసం పనిచేశారని జగ్గారెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఉత్తమ్ పనిచేశారనడం సరికాదని వ్యాఖ్యానించారు. పార్టీ కేడర్ లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారని అభిప్రాయపడ్డారు. పీసీసీతో పాటు పార్టీలో సీనియర్ నేతలు సమన్వయంతో పనిచేసినప్పుడే కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందని స్పష్టం చేశారు.
కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడారని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ ఇన్ చార్జి కుంతియాలు అమ్ముడుపోయారన్నది సరికాదన్నారు. వీళ్లిద్దరినీ ఎవ్వరూ కొనలేరని తేల్చిచెప్పారు.