digvijay singh: దిగ్విజయ్ సింగ్ రోడ్ షోలో కాషాయం కండువాలు ధరించిన పోలీసులు
- భోపాల్ లో దిగ్విజయ్ రోడ్ షో
- హాజరైన కంప్యూటర్ బాబా
- పోలీసులు కాషాయ కండువాలు ధరించలేదన్న డీఐజీ
భోపాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిర్వహించిన రోడ్ షోలో పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. రోడ్ షో సందర్భంగా మఫ్టీలో విధులకు వచ్చిన పోలీసులు కాషాయ కండువాలు ధరించారు. ఈ రోడ్ షోకు ప్రముఖ హిందూ సాధువు కంప్యూటర్ బాబా హాజరయ్యారు. దిగ్విజయ్ ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రోడ్ షో సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ దిగ్విజయ్ నినాదాలు చేశారు.
ఈ రోడ్ షో బందోబస్తుకు వచ్చిన పోలీసులు కాషాయం కండువాలు ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, 'కంప్యూటర్ బాబా నిర్వహించిన ఈ కార్యక్రమం బందోబస్తుకు మేము వచ్చాం. కాషాయం కండువాలు ధరించాలని నిర్వాహకులు కోరడంతో, వాటిని వేసుకున్నాం' అని చెప్పారు. అయితే, దీనిపై భోపాల్ డీఐజీ మాట్లాడుతూ, పోలీసులెవరూ కాషాయం కండువాలు ధరించలేదని చెప్పడం కొసమెరుపు.