Telangana: అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతల ఫోకస్ మారిపోయింది: కొండా విశ్వేశ్వరరెడ్డి
- టీఆర్ఎస్ గెలిచాక వారి ఫోకస్ మారిపోయింది
- రంగారెడ్డి జిల్లాను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు
- యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత
కాలక్రమంలో టీఆర్ఎస్ లో పరిస్థితులు మారిపోయాయని కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అందుకే టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి విషయంలో నేతల ఫోకస్ మారిపోయిందని చెప్పారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు.
ఇంటింటికి మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన టీఆర్ఎస్ నేతలు, ఆ తర్వాత ఓట్లను అడిగారని గుర్తుచేశారు. జీవో 111 అనే ఘోరమైన చట్టాన్ని తీసేస్తామని చెప్పినా చేయలేదని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల భర్తీ కూడా తెలంగాణలో సరిగ్గా సాగలేదన్నారు.
ఈ మోసాల్లో తాను భాగమయ్యానని, ఆ అపరాధనా భావాన్ని భరించలేక పోయానని చెప్పారు. తాను కొన్ని ఉద్యోగాలను సృష్టిస్తే కొందరు టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోయారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ కారణాలతోనే తాను టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు.