Pakistan: బాలాకోట్ దాడిలో 170 మంది ఉగ్రవాదులు హతం.. వెల్లడించిన ఇటలీ జర్నలిస్ట్
- బాలాకోట్ దాడి విషయంలో పాక్ అబద్ధాలు
- క్షతగాత్రులను పాక్ ఆర్మీ మిలటరీ ఆసుపత్రికి తరలించింది
- హతమైన వారిలో 11 మంది ట్రైనర్లు
బాలాకోట్ దాడులు జరిగాయా? లేదా? అన్న ప్రశ్నకు ఇన్నాళ్లకు సమాధానం దొరికినట్టు అయింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ ఘంటాపథంగా చెబుతుండగా, ఒక్కరు కూడా చనిపోలేదని పాక్ వాదిస్తోంది.
మరోవైపు, దాడులు జరగనే లేదని, జరిగి ఉంటే సాక్ష్యాలు వెల్లడించాలంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటలీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ ఫ్రాన్సెస్కా మారినో తాజాగా వెల్లడించిన విషయం మరోసారి చర్చకు కారణమైంది. బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన దాడుల్లో 130-170 మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారని మారినో పేర్కొన్నారు. తనకు లభ్యమైన సమాచారం ప్రకారం దాడుల విషయంలో పాక్ అబద్ధాలు చెబుతోందని అర్థమవుతోందన్నారు. ఈ దాడుల్లో మొత్తంగా 170 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు వివరాలు లభ్యమయ్యాయన్నారు.
భారత వాయుసేన దాడి తర్వాత రెండున్నర గంటల్లోపే పాక్ ఆర్మీ శింకియారీ బేస్ క్యాంప్ నుంచి బాలాకోట్‌కు వచ్చిందన్నారు. భారత దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని శింకియారీకి తరలించి చికిత్స అందించిందని మారినో తన కథనంలో పేర్కొన్నారు. దాడిలో గాయపడిన వారిలో 45 మంది ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారని తెలిపారు. చికిత్స పొందుతూ 20 మంది ప్రాణాలు విడిచారని మారినో వివరించారు. కోలుకున్న ఉగ్రవాదులు మాత్రం పాక్ ఆర్మీ అదుపులో ఉన్నట్టు తెలిపారు. భారత దాడిలో చనిపోయిన వారిలో 11 మంది ట్రైనర్లు కూడా ఉన్నారని వెల్లడించారు.