Telangana: వివాహంలో విషాదం.. ఆహారం కలుషితం..ముగ్గురు చిన్నారుల మృతి
- ఆదిలాబాద్ జిల్లాలోని కొలాంగూడలో ఘటన
- రిసెప్షన్‌లో మిగిలిన వాటిని తర్వాతి రోజు వడ్డించిన వైనం
- తిన్న వెంటనే అస్వస్థత.. ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స
పెళ్లి రిసెప్షన్‌లో మిగిలిపోయిన మాంసాహారాన్ని తరువాత రోజు తిన్న ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొలాంగూడలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన ఓ జంట సోమవారం పెళ్లి చేసుకుంది. మంగళవారం రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరినీ పిలిచి వైభవంగా నిర్వహించారు. విందులో మాంసాహారాన్ని వడ్డించారు.
రిసెప్షన్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను బుధవారం కొందరు బంధువులు తిన్నారు. మిగిలిన మాంసాన్ని పిల్లలకు తినిపించారు. మాంసం తిన్న చిన్నారులు కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే ఏడాది వయసున్న బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
అస్వస్థతకు గురైన 24 మందిని నార్నూర్ ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. అయితే, ఆ సమయంలో ఓ వైద్యురాలు, ఏఎన్‌ఎం మాత్రమే ఉండటంతో కొందరిని అక్కడి నుంచి ఉట్నూర్ ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.