amrapali case: సుప్రీంకోర్టు ఆదేశాలలోని పేరు మార్చేసిన రిజిస్ట్రీ సిబ్బంది.. సీరియస్ అయిన న్యాయమూర్తులు
- ఆమ్రపాలి కేసులో ఆడిటర్ పేరు మార్పు
- విషయం తెలిసి ఆశ్చర్యపోయిన ధర్మాసనం
- అవకతవకలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ తన కస్టమర్లు ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను ఇతరత్రా వ్యాపారాల్లోకి మళ్లించి, ఇళ్లను సకాలంలో పూర్తిచేసి వారికి అప్పగించడంలో విఫలమయ్యిందన్న ఆరోపణల కేసులో సుప్రీంకోర్టుకే షాకిచ్చారు రిజిస్ట్రీ సిబ్బంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను మార్చేసి ఇష్టానుసారం వ్యవహరించినట్లు బయట పడడంతో కేసు విచారిస్తున్న జస్టిస్ అరుణ్‌మిశ్ర, జస్టిస్ యు.లలిత్ లతో కూడిన ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆమ్రపాలి గ్రూప్‌నకు సామగ్రి సరఫరా చేస్తున్న జ్యోతింద్ర స్టీల్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు మే 9 నుంచి పవన్ అగర్వాల్ అనే ఆడిటర్ ముందు హాజరై వివరాలు సమర్పించాలని బెంచ్ ఆదేశించింది. అయితే కోర్టు సిబ్బంది ఆర్డర్ కాపీలో అగర్వాల్‌కు బదులు రవీందర్‌భాటియా పేరు చేర్చారు.
బుధవారం విచారణ సందర్భంగా గమనించిన ధర్మాసనం, ఆర్డర్ కాపీలో పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సిబ్బందిని మభ్యపెట్టి అవకతవకలకు పాల్పడదామనుకునే వారి ఆటలు సాగనియ్యబోమని హెచ్చరించింది. వ్యవస్థను నాశనం చేయాలని చూసే వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తామని స్పష్టం చేసింది.