Narendra Modi: రాజీవ్‌గాంధీపై మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ సీనియర్ నేత
- రాజీవ్‌ను కరెప్షన్ నంబరు వన్ అన్న మోదీ
- ఖండించిన బీజేపీ సీనియర్ నేత
- ఇలాంటి ఆరోపణలను ఎవరూ విశ్వసించబోరన్న శ్రీనివాస ప్రసాద్
భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తన జీవితాన్ని నంబర్ వన్ అవినీతిపరుడిగా ముగించుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాగా, రాజీవ్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలను కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస ప్రసాద్ ఖండించారు. రాజీవ్ గాంధీ కరెప్షన్ కారణంగా చనిపోలేదని, శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో ఆయన చనిపోయారని పేర్కొన్నారు.
‘‘రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ చంపేసింది. అవినీతి ఆరోపణలతో ఆయన చనిపోలేదు. ఇటువంటి ఆరోపణలను ఎవరూ విశ్వసించరు. చివరికి నేను కూడా నమ్మను. మోదీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అయితే, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. రాజీవ్ చాలా చిన్నవయసులోనే పెద్ద బాధ్యతలు చేపట్టారంటూ రాజకీయ ఉద్దండుడైన వాజ్‌పేయి లాంటి వారే రాజీవ్ గురించి గొప్పగా చెప్పారని ప్రసాద్ గుర్తు చేశారు.