Andhra Pradesh: నేడు అమరావతిలో స్క్రీనింగ్ కమిటీ భేటీ.. నిర్ణయం తీసుకోనున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం!
- ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ
- సమావేశం అజెండా ఖరారుకు సీఎంవో ఆదేశం
- అధికారుల నివేదికలను పరిశీలించనున్న కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ నేడు అమరావతిలో సమావేశం కానుంది. ఈ నెల 14న ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఈ కమిటీ ఖరారు చేయనుంది. ఓసారి స్క్రీనింగ్ కమిటీ ఆమోదం తెలిపాక ఈసీ కేబినెట్ భేటీకి పచ్చజెండా ఊపుతుంది. మంత్రివర్గ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయం సీఎస్ కు లేఖ రాసింది.
దీంతో సీఎంవో పంపిన నోట్ ను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నిశాఖల అధికారులకు పంపారు. ఫణి తుపాను సహాయక చర్యలు, కరవు, తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ, వాతావరణ పరిస్థితులపై నివేదికలు సమర్పించాలని కోరారు. అధికారులంతా తమ నివేదికలను పంపిన నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ కేబినెట్ భేటీలో చర్చించాల్సిన అజెండాపై ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఈ సమావేశానికి రావాల్సిందిగా అన్నిశాఖల కార్యదర్శులతో పాటు సీఎం కార్యదర్శి సాయిప్రసాద్ ను సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. అన్నీ అనుకున్నట్లు సాగితే ఈ నెల 14న ఏపీ కేబినెట్ సమావేశం వుంటుంది.