smart phone: స్మార్ట్ ఫోన్ ఎఫెక్ట్.. తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయిన పిల్లాడు.. వీడియో వైరల్
- చైనాలోని ఓ నగరంలో ఘటన
- తల్లిని వదిలేసి మరో వ్యక్తితో ప్రయాణం
- చివరికి తల్లి వద్దకు పరిగెత్తిన బాలుడు
ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కొంచెం ఖాళీ దొరికినా ఫోన్లలో బిజీగా గడిపేస్తున్నారు. ఫోన్లలో పడిపోయి చుట్టుపక్కల ఏం జరుగుతోంది? ఎవరు ఏం చేస్తున్నారు? అన్న విషయాలను మర్చిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. చైనాలో ఓ బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ కు వచ్చాడు. అది పూర్తయ్యాక ఇంటికి బయలుదేరాడు. అయితే ఇక్కడ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఫోన్ లో మునిగిపోయిన సదరు బాలుడు తన తల్లి చేతిని పట్టుకోవడానికి బదులుగా మరో వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని నడవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ వ్యక్తి కూడా పిల్లాడి అమాయకత్వాన్ని ఆస్వాదిస్తూ ముందుకు కదిలాడు. ఈ మొత్తం తతంగాన్ని మరో వ్యక్తి వీడియో తీయడం మొదలుపెట్టాడు.
చివరికి మాల్ నుంచి కొంతదూరం నడిచిన తర్వాత ఎందుకో పిల్లాడు ఫోన్ నుంచి తలపైకి ఎత్తాడు. తనతో ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అనంతరం తల్లి దగ్గరకు పరిగెత్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.