Andhra Pradesh: చంద్రబాబు ఓటమి ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నాయి.. అందుకే అసహనం పెరిగిపోయింది!: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
- బాబును భరించే స్థితిలో ఏపీ లేదు
- జాతీయ నాయకులను ఆకట్టుకునేందుకు బాబు ప్రయత్నం
- హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత
చంద్రబాబును భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ లేదనీ, మార్పు కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. జాతీయ సర్వేల నుంచి చంద్రబాబు సొంత సర్వేల వరకూ అన్నీ టీడీపీ ఓడిపోతుందని చెబుతున్నాయన్నారు. ప్రజలు వైసీపీ వెంట ఉన్నారన్న సమాచారం తెలియడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. అందుకే ఓటమి భయం, అభద్రతాభావంతో ఆయన ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై రగడ చేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా జగన్ కు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. దీంతో జాతీయ స్థాయిలో మిగతా నాయకులను ఆకట్టుకునేందుకు, లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ప్రభుత్వం సమీక్షలు నిర్వహించవచ్చనీ, సాధారణంగా అయితే కోడ్ ఉన్నప్పుడు చేయకూడదని ఉమ్మారెడ్డి అన్నారు. ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు అగౌరవపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎన్నికల కమిషన్ కు మాత్రమే జవాబుదారీగా ఉంటారని చెప్పారు.