Swamy Goud: తెలంగాణలో ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చెయ్యొద్దంటూ హైకోర్టు ఆదేశం
- భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హత వేటు
- పార్టీ ఫిరాంపులకు పాల్పడ్డారని ఫిర్యాదు
- అనర్హత వేటు వేసిన స్వామి గౌడ్
తెలంగాణలోని రెండు స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో దీనిపై హైకోర్టు స్పందించింది. నోటిఫికేషన్ జారీ చెయ్యొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హత వేటు వేయడంతో ఆ స్థానాల్లో ఖాళీ ఏర్పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతిరెడ్డి ఎన్నిక కాగా, శాసనసభ్యుల కోటాలో యాదవరెడ్డి గెలిచారు. అయితే వీరిద్దరూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ శాసనమండలి పక్షం మండలి చైర్మన్ స్వామిగౌడ్కు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో వారిద్దరిపై అనర్హత వేటు వేస్తూ స్వామిగౌడ్ ఆదేశాలు జారీ చేశారు. తమ సభ్యత్వ రద్దును సవాల్ చేస్తూ భూపతిరెడ్డి, యాదవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను నేడు హైకోర్టు మరోసారి విచారించింది. తమ వాదన వినకుండానే ఏకపక్షంగా మండలి నిర్ణయం తీసుకుందని వాదించారు. తాము కాంగ్రెస్లో చేరామనేందుకు ఎలాంటి ఆధారం లేకున్నా ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా మండలి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం ఆ ఇద్దరి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 15 వరకూ జారీ చెయ్యొద్దని ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను 15కు వాయిదా వేసింది.