Hoshiarpur: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల దుర్మరణం
- అదుపుతప్పి చెట్టును ఢీకొన్న వాహనం
- రోడ్డుపై చెల్లాచెదరుగా పడిన ప్రయాణికులు
- గాయపడిన వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమం
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదిమంది దుర్మరణం పాలవగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉస్మాన్ షాహీద్ గ్రామానికి చెందిన వీరంతా హిమాచల్‌ప్రదేశ్, ఉనా జిల్లాలోని ప్రార్థనా మందిరాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొందరు కుటుంబ సభ్యులతో కలిసి పీర్ నిగాహను దర్శించుకునేందుకు గురువారం ఉదయం మహింద్రా బొలెరో వాహనంలో బయలుదేరారు. గురువారం సాయంత్రం తిరిగి వస్తుండగా అదుపు తప్పిన వాహనం రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో వ్యానులోనుంచి బయటకు ఎగిరి పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన అందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పదిమంది చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన 13 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, మృతుల కుటుంబాలకు కలెక్టర్ లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు.