Tej bahadur: ప్రధానిపై బరిలోకి దిగిన తేజ్‌బహదూర్‌కు సుప్రీంలోనూ చుక్కెదురు
- తేజ్‌బహదూర్ నామినేషన్‌ను తిరస్కరించిన ఈసీ
- సుప్రీంను ఆశ్రయించిన మాజీ జవాను
- పిటిషన్ స్వీకరణకు కారణం కనిపించడం లేదన్న ధర్మాసనం
వారణాసి నుంచి తాను దాఖలు చేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్‌బహదూర్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆయన పిటిషన్‌ను స్వీకరించేందుకు తమకు సరైన కారణాలు కనపడలేదని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
తేజ్ బహదూర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు వేయొచ్చన్నారు. అయితే, ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్ ద్వివేది మాట్లాడుతూ.. ఈసీ చర్యలు ఎన్నికల ప్రక్రియకు విరుద్ధంగా ఉంటే కనుక ఎన్నికల తర్వాత మాత్రమే పిటిషన్లు వేయాలంటూ గత తీర్పులను ప్రస్తావించారు. కాగా, బీఎస్ఎఫ్ మాజీ జవాను అయిన తేజ్ బహదూర్ సమాజ్‌వాదీ పార్టీ తరపున వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీకి దిగారు. అయితే, వివిధ కారణాలతో ఆయన పిటిషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.