West Bengal: ఐపీఎల్ బెట్టింగ్‌లు వద్దందని.. కుటుంబ సభ్యులతో కలిసి భార్యను చంపేసిన భర్త
- ఐపీఎల్ లో రూ.2 లక్షల పందేలు కాసిన భర్త
- అధిక వడ్డీలకు అప్పులు
- వారించిన భార్య చేత యాసిడ్ తాగించిన వైనం
ఐపీఎల్‌లో బెట్టింగ్ వద్దన్న భార్యను కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా చంపేశాడో భర్త. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా పట్టణంలో జరిగిందీ ఘటన. భర్త, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో తీవ్రంగా గాయపడిన అర్పిత దాస్‌గుప్తా (32)ను వెంటనే మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (ఎంఎంసీహెచ్)కి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
అర్పిత తండ్రి సంతోష్ దత్తా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. అర్పిత- సువేందు దాస్‌గుప్తాలకు ఆరేళ్ల క్రితం వివాహమైందని అర్పిత తండ్రి తెలిపారు. ఐపీఎల్ బెట్టింగులకు అలవాటు పడిన భర్తను వారించడంతోనే తన కుమార్తెను హత్య చేసినట్టు ఆయన ఆరోపించారు. ఈ విషయంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని తెలిపారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సువేందు, కుటుంబ సభ్యులతో కలిసి తన కుమార్తెకు బలవంతంగా యాసిడ్ తాగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విషయం తెలిసిన తాను ఆసుపత్రికి వెళ్లే సరికే ఆమె అచేతనంగా పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన అల్లుడు సువేందుకు బెట్టింగులు అలవాటని, ఐపీఎల్‌లో ఇప్పటికే రెండు లక్షల రూపాయల వరకు పందాలు కాశాడని తెలిపారు. పందేల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేశాడని, వాటిని తిరిగి తీర్చలేదని పేర్కొన్నారు. కాగా, హత్య జరిగిన రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సువేందు అప్పుల వాళ్ల చెరలోనే ఉన్నాడని, రాత్రి ఇంటికి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.