Delhi CM: సీఎం చెంప పగలగొట్టమని నాకెవరూ చెప్పలేదు: కేజ్రీవాల్ పై దాడి నిందితుడు
- ఈ నెల 4న సీఎం కేజ్రీవాల్ చెంప పగలగొట్టిన సురేశ్
- తన వెనక ఏ రాజకీయ పార్టీ లేదని స్పష్టీకరణ
- చేసిన తప్పుకు చింతిస్తున్నానన్న సురేశ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 4న ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెంపను ఓ వ్యక్తి చెళ్లుమనిపించాడు. అతడిని పట్టుకుని చావబాదిన ఆమ్ ఆద్మీపార్టీ కార్యకర్తలు అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని మెకానిక్ సురేశ్‌గా గుర్తించారు. తాజాగా, ఈ ఘటనపై సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను తానెందుకు కొట్టానో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చేసిన పనికి చింతిస్తున్నట్టు చెప్పాడు. సీఎంపై దాడి చేయమని ఏ రాజకీయ పార్టీ తనకు చెప్పలేదన్నాడు. పోలీసులు తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదని, తాను ఏం తప్పు చేశానో చెప్పారని పేర్కొన్నాడు.
ఈనెల 4న పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ప్రచారం చేస్తున్న ఓపెన్ టాప్ జీప్‌పైకి ఎక్కిన సురేశ్ కేజ్రీవాల్ చెంప పగలగొట్టాడు. వెంటనే అతడిని కిందికి ఈడ్చేసిన ఆప్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. కేజ్రీవాల్‌పై 2015లో తొలిసారి దాడి జరిగింది. ఆ తర్వాత మళ్లీ అదే ఏడాది రెండోసారి ఆయన చెంపదెబ్బ తిన్నారు. ఓ ఆటోవాలా కేజ్రీవాల్ చెంప వాయించాడు.