Reliance: ప్రపంచ ప్రసిద్దిచెందిన బొమ్మల కంపెనీపై కన్నేసిన ముఖేశ్ అంబానీ
- 259 ఏళ్ల చరిత్ర ఉన్న హామ్లేస్ ను కొనుగోలు చేస్తున్న రిలయన్స్
- రూ.620 కోట్లతో కొనుగోలు
- బీఎస్ఈలో ఫైలింగ్!
హామ్లేస్... ఇదో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొమ్మల తయారీ సంస్థ. దీనికి 18 దేశాల్లో 167 స్టోర్లు ఉన్నాయి. యూకేతో పాటు భారత్, రష్యా, చైనా, జర్మనీ, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో హామ్లేస్ అవుట్ లెట్లు ఉన్నాయి. హామ్లేస్ తయారుచేసే బొమ్మలకు సంపన్న వర్గాల్లో ఎంతో డిమాండ్ ఉంది. అయితే, కొన్నాళ్లుగా నిలకడగా లాభాలు ఆర్జించడంలో విఫలమవుతున్న నేపథ్యంలో హామ్లేస్ అమ్మకానికి వచ్చింది. దీనిపై భారత అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసక్తి చూపిస్తున్నారు.
259 ఏళ్ల చరిత్ర ఉన్న హామ్లేస్ ను సొంతం చేసుకోవడానికి అవసరమైన అన్ని ప్రక్రియలు దాదాపు పూర్తయినట్టు సమాచారం. ఇప్పటివరకు హామ్లేస్ కు భారత్ లో ఫ్రాంచైజీగా వ్యవహరించిన రిలయన్స్ సంస్థే 100 శాతం షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఒప్పందం తాలూకు వివరాలను రిలయన్స్ సంస్థ బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్) ఫైలింగ్ లో కూడా పొందుపరిచింది. ఈ టేకోవర్ విలువ రూ.620 కోట్లు అని తెలుస్తోంది.