Gowtham Gambhir: నా తప్పుంటే చట్టపరమైన చర్య తీసుకోండి.. ఎదుర్కోవడానికి రెడీ!: గౌతమ్ గంభీర్
- మహిళలను గౌరవించే కుటుంబం నుంచి వచ్చా
- కేజ్రీవాల్ ఇంతకు దిగజారతారని అనుకోలేదు
- తప్పుడు ఆరోపణలని తేలితే క్షమాపణ చెప్పాలి
తనకు వ్యతిరేకంగా ఢిల్లీ తూర్పు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ అభ్యంతరకర పదజాలంతో కరపత్రాలను ముద్రించి, వాటిని దినపత్రికల్లో ఉంచి పంపిణి చేస్తున్నారంటూ ఆప్ అభ్యర్థి అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆమె ఆ కరపత్రాన్ని మీడియా ఎదుట చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
అతిషి చేసిన ఆరోపణలను గంభీర్ తీవ్రంగా ఖండించారు. మహిళలను అత్యంత గౌరవంగా చూసే కుటుంబం నుంచి తాను వచ్చానని, సీఎం కేజ్రీవాల్ ఈ స్థాయికి దిగజారుతారని అనుకోలేదన్నారు. మీ ఆరోపణల్లో నిజముందని భావించినా, అందుకు తగిన ఆధారాలున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. తాను వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని తేలితే వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై పరువు నష్టం దావా వేస్తానని గంభీర్ హెచ్చరించారు.