Sam pitroda: తన వ్యాఖ్యలకు పిట్రోడా క్షమాపణలు చెప్పాల్సిందే: సొంత నేతపై రాహుల్ ఫైర్
- సిక్కుల ఊచకోతపై పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు
- తీవ్రంగా పరిగణించిన రాహుల్ గాంధీ
- క్షమాపణలు చెప్పిన పిట్రోడా
1984 సిక్కుల ఊచకోత సంఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సొంత పార్టీ నేత, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శాం పిట్రోడాపై ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైరయ్యారు. చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై శుక్రవారం రాహుల్ మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమైనవన్నారు.
సిక్కు వ్యతిరేక అల్లర్లు విషాదమని, బాధితులకు న్యాయం జరగాలని, నిందితులకు శిక్ష పడాల్సిందేనని అన్నారు. 1984లో జరిగింది భయంకరమైన విషాదమని పేర్కొన్న రాహుల్.. అలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు. ఈ విషయంలో తాము స్పష్టమైన వైఖరితో ఉన్నట్టు పేర్కొన్నారు.
కాగా, ఇటీవల సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి పిట్రోడాను ఓ విలేకరి ప్రశ్నించగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటి గురించి ఇప్పుడెందుకని ప్రశ్నించిన పిట్రోడా.. జరిగిందేదో జరిగిందని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన పిట్రోడా క్షమాపణలు వేడుకున్నారు. తనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో పొరపాటు జరిగిందని అన్నారు. ‘జో హువా వో బురా హువా’ అని చెప్పాలనుకుని ‘బురా’ అనే పదాన్ని మర్చిపోయానని వివరణ ఇచ్చారు.