Bhadradri Kothagudem District: ఇక్కడా అదే పొరపాటు... మాజీ మంత్రి తుమ్మల కుడి చేతికి సిరాచుక్క వేసిన ఎన్నికల సిబ్బంది

  • ఎడమ చెయ్యి చూపుడు వేలుకు వేయాలి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఘటన
  • తమిళనాడులో రజనీకాంత్‌ విషయంలో ఇలాగే జరిగింది
ఎన్నికల్లో ఓటు వేసినట్టు తెలిపే సిరా చుక్క విషయంలో తెలంగాణ ఎన్నికల సిబ్బంది పొరపాటు చేశారు. రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి 28వ పోలింగ్‌ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎడమ చేతికి బదులు కుడి చేతి మధ్య వేలుకు సిరాచుక్క వేశారు.

సాధారణంగా ఎన్నికల్లో ఎడమ చెయ్యి చూపుడు వేలుకు సిరా చుక్క వేస్తారు. ఓసారి వేసిన సిరాచుక్క చెరిగిపోయేందుకు నెలన్నర రోజులుపైనే పడుతుంది. అందువల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేలు మార్పునకు ఎన్నికల సంఘం అదేశాలు ఇస్తుంది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎడమ చెయ్యి మధ్య వేలుకు సిరా చుక్క వేయాలని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఆదేశించింది.

కాగా, సార్వత్రిక ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగడంతో చూపుడు వేలుకు బదులు మధ్య వేలుకు సిరా చుక్క వేయాలని ఆదేశించింది. అయితే మాజీ మంత్రి తుమ్మల ఎడమ చెయ్యికి బదులు కుడి చెయ్యి మధ్య వేలుకు సిబ్బంది సిరా చుక్క వేశారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమిళనాడులో ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ కుడి చేతికి సిరా చుక్క వేసినందుకు ఎన్నికల సంఘం అక్కడి సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. మరి తెలంగాణ సిబ్బంది విషయంలో ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Bhadradri Kothagudem District
tummala nageswararao
poling ink

More Telugu News