ITC: కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత
- వైసీడీగా పారిశ్రామిక వర్గాల్లో సుపరిచితులు
- సుదీర్ఘ కాలం కంపెనీలో పలు కీలక బాధ్యతల నిర్వహణ
- 2022 వరకు పదవీ కాలం ఉండగానే మృతి
పారిశ్రామిక వర్గాల్లో వైసీడీగా ప్రాచుర్యం పొందిన దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ చైర్మన్ వై.సి.దేవేశ్వర్(72) ఈరోజు ఉదయం కన్నుమూశారు. కంపెనీలో సుదీర్ఘకాలం పలు కీలక బాధ్యతలు నిర్వహించిన దేవేశ్వర్ ఐటీసీని ఒక ఎఫ్ఎంసీజీగా మలిచిన ఘనత దక్కించుకున్నారు. ఆయన నేతృత్వంలో కంపెనీ బాట్ నుంచి టేకోవర్ ముప్పును కూడా తొగించుకోగలిగింది. అనంతరం ఎఫ్ఎంసీజీగా రంగంలోకి దిగి విజయవంతంగా ముందుకు దూసుకువెళ్లింది.
దీంతో ఐటీసీ ఆదాయం రూ. 5,200 కోట్ల నుంచి రూ. 51 వేల కోట్లకు చేరింది. ఏటా ఐటీసీ వాటాదారులకు 23.3 శాతం రాబడిని కంపెనీ అందిస్తోంది. ఇదంతా దేవేశ్వర్ ఘనతగానే చెబుతారు. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్ అంచెలంచెలుగా ఎదుగుతూ 1996 నాటికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్థాయికి చేరారు. 2017 వరకు సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2018 జనవరిలో ఐటీసీ ఆయనను 2022 వరకు చైర్మన్ కొనసాగించాలని నిర్ణయించింది. అయితే పదవీకాలం పూర్తికాకముందే ఆయన కన్నుమూశారు.