Andhra Pradesh: ఏపీలో మాకు 90 సీట్లు వస్తాయి.. చంద్రబాబు, జగన్ లే గెలవాలని రాసిపెట్టారా?: నాగబాబు
- జనసేన ఫలితాలపై మాకు చాలా ఆశలున్నాయి
- సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాం
- ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాబ్రదర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించబోయే ఫలితాలపై తమకు చాలా పెద్ద ఆశలు ఉన్నాయని మెగాబ్రదర్, నరసాపురం లోక్ సభ జనసేన అభ్యర్థి నాగబాబు తెలిపారు. అయితే మిగతా రాజకీయ పార్టీల్లా ‘మాకు ఇన్నిసీట్లు వస్తాయి.. అన్ని సీట్లు వస్తాయ’ అని చెప్పబోమని అన్నారు.
ప్రజలు తమ తీర్పును ఇచ్చేశారనీ, దానిపై మాట్లాడటం అనవసరమని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? లేక ప్రభుత్వంలో భాగస్వామి అవుతామా? అనేంత దూరం తాము ఇంకా ఆలోచించలేదన్నారు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు.
‘మేం రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాం. సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయం చేయాలని కల్యాణ్ బాబు, మేము వచ్చాం. కాబట్టి అందులో సక్సెస్ లేదా ఫెయిల్యూర్ గురించి అస్సలు ఆలోచించం. మాది 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కాబట్టి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? రాకుంటే కింగ్ మేకర్ అవుతామా? అన్న ఆలోచనే మాకు లేదు. మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టం’ అని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో నేతలకు ఇన్ని సీట్లు గెలుస్తామని అంచనాలు ఉంటాయన్న మీడియా ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ..‘మేం గెలుస్తామని నమ్మకం ఉందండి. 90 సీట్లు రావొచ్చు మాకు. ఎందుకు రాకూడదు. ఏం ఓన్లీ జగన్ గారికే వస్తాయా? చంద్రబాబు గారికే వస్తాయా? వాళ్లు మాత్రమే రాసిపెట్టుకున్నారా? మాకు 150 సీట్లు కూడా రావొచ్చేమో?’ అని వ్యాఖ్యానించారు. తాము కుల రాజకీయాలను చేయబోమని నాగబాబు స్పష్టం చేశారు.