Andhra Pradesh: పవన్ బ్యాంకు అకౌంట్లో రూ.55 లక్షలు ఉంటే ‘హుద్ హుద్’ కు ఒకేసారి రూ.50 లక్షల చెక్ ఇచ్చేశాడు!: నాగబాబు
- అత్తారింటికి దారేది పెద్ద హిట్టయింది
- కానీ పవన్ కల్యాణ్ కు అది ఉపయోగపడలేదు
- ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన నేత
ఫ్యామిలీ, పిల్లలు బతికేందుకు కావాల్సినంత మొత్తాన్ని పవన్ కల్యాణ్ సంపాదించుకున్నాడని జనసేన నేత, మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు. ఇక రాజకీయాల్లో నేతలు ఇచ్చే విరాళాలు, ప్రజలు అందించే సాయం ఆధారంగా జనసేన పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ రేంజ్ ఉన్న నటుల ఆస్తి వేల కోట్లలో ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ కల్యాణ్ ఆస్తులు మాత్రం చెప్పుకోలేనంత తక్కువగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు.
జనసేన ఏర్పాటు సందర్భంగా తాను రూ.1.20 కోట్ల విరాళం ఇచ్చానని నాగబాబు గుర్తుచేసుకున్నారు. ‘‘పవన్ కల్యాణ్ సంపాదించిన డబ్బులు పంచేస్తుంటారు. ఆయన డబ్బును దాచుకోరు. సినిమాలు ఫ్లాప్ అయితే తన రెమ్యునరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా హిట్ అయినా పవన్ కల్యాణ్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అప్పట్లో ప్రొడ్యూసర్ కు అండగా నిలబడి, కొంత డబ్బు ఇచ్చి సంతకాలు చేయాల్సి వచ్చింది’’ అని వ్యాఖ్యానించారు.
‘హుద్ హుద్ తుపాను సమయంలో కల్యాణ్ బాబు అకౌంట్ లో రూ.55 లక్షలు ఉన్నాయి. ఒకే ఒక చెక్ రూ.50 లక్షలకు రాసి గవర్నమెంట్ కు ఇచ్చేశాడు. సొంత ఖర్చులకు రూ.5 లక్షలు ఉంచుకుని మిగతాదంతా ఇచ్చేశాడు. పవన్ కల్యాణ్ అంటే అదే’ అని తెలిపారు. డబ్బులు సంపాదించాలని అనుకుంటే పవన్ కల్యాణ్ కు వేల కోట్లలో ఆస్తులు ఉండేవని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ బాగా ఫన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అనీ, ఇంటి దగ్గర పిల్లలను ఆటపట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటారని నాగబాబు అన్నారు.