Telangana: ‘మల్లన్న సాగర్’పై కేసీఆర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!
- నిర్వాసితులకు పునరావాసంపై చర్చ
- యుద్ధప్రాతిపదికన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ఆదేశం
- ఈ నెల 15న కేసును విచారించనున్న హైకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారిన ప్రజలకు నష్టపరిహారం చెల్లించడం, వారికి పునరావాసం కల్పించడంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రగతి భవన్ లో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో.. నిర్వాసితులకు యుద్ధప్రాతిపదికన పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు.
ఈ నెల 15న మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కేసు హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ మేరకు స్పందించారు. ఈ సందర్భంగా మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆయా గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి పరిహారం చెల్లించామని సీఎంకు చెప్పారు.
దీంతో ఇప్పటివరకూ చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకూ వచ్చింది? గ్రామాలవారీగా ఎంతమందికి చెక్కులు ఇచ్చారు? ఇంకా చెక్కులు పొందని ప్రజలు ఎవరైనా ఉన్నారా? తదితర అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.