posani: దాసరి నారాయణరావుగారి వంటి లెజెండ్ హాస్పిటల్లో వుంటే అప్పుడు పట్టించుకున్న నాథుడు లేడు: పోసాని కృష్ణమురళి
- ఒకసారి దాసరిగారికి బైపాస్ సర్జరీ జరిగింది
- డబ్బులు అడుగుతాడని ఎవరూ ముఖం చూపించలేదు
- నేను ఇచ్చిన యాడ్ చూసి ఆయన ఏడ్చేశారు
తెలుగు చిత్రపరిశ్రమలో తిరుగులేని దర్శకుడిగా దాసరి నారాయణరావు ఒక వెలుగు వెలిగారు. అలాంటి దాసరి నారాయణరావు గురించి తాజా ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ప్రస్తావించాడు. " ఒకానొక సమయంలో దాసరి నారాయణరావుగారు బైపాస్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అందుకు అవసరమైన 3 లక్షలు ఆయన దగ్గర లేవు. దాంతో 50 వేల రూపాయలతో ఆయన 'మహావీర్' హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారు. కనిపిస్తే ఆయన ఎక్కడ డబ్బులు అడుగుతాడోనని పట్టుమని పదిమంది కూడా ఆయనను చూడటానికి హాస్పిటల్ కి వెళ్లలేదు.
ఎంతోమందికి ఆయన సాయపడ్డారు .. మరెంతో మందిని నిలబెట్టారు .. ఇంకెంతో మందికి అండగా నిలిచారు. అలాంటి ఆయన పరిస్థితిని గురించి నా జర్నలిస్ట్ మిత్రుడి ద్వారా నాకు తెలిసింది. వెంటనే నేను దాసరిగారి క్షేమాన్ని కోరుతూ లక్షరూపాయలు ఖర్చుచేసి ఒక దిన పత్రికలో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చాను. అది చూసి దాసరిగారు కన్నీళ్లు పెట్టుకున్నారట. ఆయన కబురుచేస్తే వెళ్లి కలిశాను. ఇనుప రేకు మంచంపై ఆయనను చూసి చాలా బాధపడ్డాను. ఆయనకి ధైర్యం చెప్పి .. దిండుకింద ఓ పాతికవేలు పెట్టేసి వచ్చాను. ఆ యాడ్ చూసిన తరువాత ఇండస్ట్రీలో కొంతమంది స్పందించారు" అని చెప్పుకొచ్చాడు.